: దయచేసి ఇచ్చిన లంచం తీసుకెళ్లండి.. ఆరునెలల తర్వాత తెచ్చివ్వండి!: రూటు మార్చిన అక్రమార్కులు
పెద్ద నోట్ల రద్దుతో అక్రమార్కుల పంథా మారింది. చేతులు తడపందే ఫైళ్లు కదపని అధికారులు, లంచం ఇస్తేనే కానీ నిర్ణయం తీసుకోబోమన్న కొందరు నేతలు ఇప్పుడు కొత్తబాట పట్టారు. లంచం సమర్పించుకున్న వారిని ఇంటికి పిలిచి మరీ ఇచ్చిన డబ్బును తిరిగి ఇచ్చేస్తున్నారు. వెనక్కి తీసుకోవాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. అదేదో వారు మంచి మనుషుల్లా మారిపోయి, ఇలా తీసుకున్న లంచాలను తిరిగి ఇచ్చేస్తున్నారనుకుంటే పొరపాటే. ఇచ్చిన లంచం డబ్బులను ఇప్పుడు తీసుకెళ్లి ఓ ఐదారు నెలలు ఆగి కొత్త నోట్లతో సరికొత్తగా లంచం ఇవ్వాలని తెగేసి చెబుతున్నారు. తద్వారా తమ వద్ద పేరుకుపోయిన నల్లధనాన్ని వదిలించుకోవాలని చూస్తున్నారు. అధికారులు, నేతల తాజా నిర్ణయంతో కాంట్రాక్టర్లు, వ్యాపారులు బెంబేలెత్తిపోతున్నారు. రూటు మారిన అధికారులు, నేతల తీరుతో కాంట్రాక్టర్లు, వ్యాపారుల పరిస్థితి దారుణంగా తయారైంది. వెనక్కి తీసుకొచ్చిన డబ్బులను ఎలా మార్చుకోవాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ శాఖల్లో పర్సెంటేజీల బాగోతం అందరికీ తెలిసిన విషయమే. ఇంజినీరింగ్ శాఖల్లో పనుల మంజూరుకు చేయి తడపాల్సిందే. కొన్ని శాఖల్లో నిర్ణీత మొత్తంలో లంచం సమర్పించుకోవాల్సి ఉండగా మరికొన్ని శాఖల్లో బిల్లుల మంజూరుకు కూడా వసూళ్లు జోరుగా సాగుతున్నాయి. లంచాల విషయమై కొంతకాలం క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ కొంత సమాచారం సేకరించింది. ఒక రాష్ట్ర పరిధిలో వివిధ శాఖలు చేపట్టే పనులు, జరిపే కొనుగోళ్ల మొత్తంలో 5-7 శాతం వరకు లంచాల లావాదేవీలు జరుగుతున్నట్టు అభిప్రాయపడింది. కొన్ని పనుల్లో ఇది మరింత ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఇంకొన్ని పనుల్లో అసలు ఉండకపోవచ్చని కూడా చెప్పింది. రాష్ట్రాన్ని బట్టి లంచాల రూపంలో చేతులు మారుతున్న సొమ్ము రూ.3 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉందని సంస్థ అభిప్రాయపడింది. లంచాల రూపంలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన పెద్ద నోట్లను మార్చుకునే వీలులేని అవినీతి నేతలు, అధికారులు తీసుకున్న లంచాన్ని ఇంటికి పిలిచి మరీ ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. తమ దగ్గర ఉంచుకుని వాటిని మురగబెట్టుకోవడం కంటే ఇచ్చిన వారికే అంటగట్టి కొన్ని నెలలు ఆగిన తర్వాత తీసుకోవడం మేలని వారు భావిస్తున్నారు. నోట్ల రద్దు తర్వాత నాలుగు రోజులపాటు ఈ విషయమై తీవ్రంగా ఆలోచించిన వారు ఆ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చారు. లంచం ఇచ్చిన వారిని ఇంటికి పిలిచి అతిథి మర్యాదలు చేసిన తర్వాత చల్లగా డబ్బులు చేతిలో పెడుతున్నారట.