: ఇక ఆథరైజేషన్ లెటర్ ఉంటేనే నగదు జమ.. ఆర్బీఐ తాజా నిర్ణయం
పెద్ద నోట్ల రద్దుతో షాక్ తిన్న నల్ల కుబేరులు తమ వద్ద ఉన్న నల్ల ధనాన్ని తెలుపుగా మార్చుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కొంతలో కొంతైనా మార్చుకోవాలనే ఉద్దేశంతో లొసుగులను ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వేరేవారి ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు జమచేస్తున్నారు. దీంతో థర్ట్ పార్టీ డిపాజిట్లపై దృష్టి సారించిన ఆర్బీఐ ఇక నుంచి ఆథరైజేషన్ లెటర్ ఉంటేనే డిపాజిట్‌కు అనుమతిస్తామని తేల్చి చెప్పింది. ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్ని బ్యాంకులను ఆదేశించింది. ఇతర రాష్ట్రాలలో చదువుకుంటున్న పిల్లల ఖాతాల్లో తల్లిదండ్రులు నగదు జమచేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ఇంతకాలం ఆథరైజేషన్ లెటర్ జోలికి పోని ఆర్బీఐ తాజాగా నగదు డిపాజిట్లు పెద్ద ఎత్తున పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు శనివారం నుంచి క్యాష్ డిపాజిట్ల మెషీన్లను కూడా ఇందుకు అనుగుణంగా మార్చేశారు. తమ అకౌంట్ నంబరు ఎంటర్ చేసి ఏటీఎం కార్డు ఇన్సర్ట్ చేస్తేనే నగదు జమ అయ్యేలా మార్చారు. దీనివల్ల నిజమైన ఖాతాదారుడు మాత్రమే లావాదేవీలు నిర్వహించే వీలుంటుంది. ఆర్బీఐ తాజా నిబంధనతో లావాదేవీలు గణనీయంగా తగ్గినట్టు బ్యాంకు అధికారులు చెబుతున్నారు.