: తిరునల్వేలి ఆటోడ్రైవర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చిన నల్లకుబేరుడు
తమిళనాడులోని తిరునల్వేలిలో ఆటోడ్రైవర్లకు ఓ నల్లకుబేరుడు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ రోజు వేకువజామున తిరునల్వేలి పాత బస్టాండు వద్దనున్న ఓ పెట్రోలు బంక్, మేలపాళయంలోనున్న మరో పెట్రోలు బంక్ వద్దకు ఇద్దరు వ్యక్తులు మోటారు బైకులపై వచ్చారు. ఈ రెండు బంకులకు రద్దైన 500, 1000 రూపాయల నోట్లను లక్ష (ఒక్కో బంక్ కు 50,000) రూపాయలు ఇచ్చారు. బంక్ కు వచ్చిన ప్రతి ఆటోకు పెట్రోల్ పోయాలని ఆదేశించి వెళ్లిపోయారు. ఈ విషయం ఈ రెండు ప్రాంతాల ఆటో డ్రైవర్లకు తెలియడంతో ఈ రెండు బంకులకు ఆటోలు క్యూకట్టాయి. నిరంతరాయంగా అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో ఆరాతీసిన పోలీసులకు డబ్బుల విషయం తెలిసింది. దీంతో పెట్రోలు బంకు సిబ్బందిని ప్రశ్నించడంతో ఆగంతుకులెవరో డబ్బులిచ్చారని, తాము పోస్తున్నామని చెప్పారు. దీంతో ఈ రెండు బంకుల్లో ఎంత పెట్రోల్ పోశారో చూడగా, 90,000 రూపాయల పెట్రోలు పోసినట్టు నిర్ధారించారు. దీంతో బంకు సిబ్బందిని అదుపులోకి తీసుకుని, సీసీ పుటేజ్ స్వాధీనం చేసుకున్నారు. నల్లకుబేరుల కోసం గాలింపు చేపట్టారు.