: నజీబ్ అహ్మద్ ను అలీగఢ్ లో చూశాను... ఓ మహిళ రాసిన మిస్టరీ లెటర్ తో పోలీసుల ఉరుకులు!


న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుంచి అదృశ్యమైన ఎంఎస్సీ విద్యార్థి నజీబ్ అహ్మద్ ను తాను అలీగఢ్ లోని ఓ మార్కెట్లో చూసినట్టు ఓ మహిళ రాసిన లేఖ పోలీసులను ఉరుకులు, పరుగులు పెట్టించింది. అహ్మద్ హాస్టల్ అడ్రస్ తో వచ్చిన ఉత్తరాన్ని హాస్టల్ అధ్యక్షుడు అజీమ్, ఈ నెల 14న అందుకుని, దాన్ని అహ్మద్ తల్లి ఫాతిమా నఫీస్ కు అందివ్వగా, ఆమె క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ఇచ్చింది. ఈ లేఖలో, తాను నజీబ్ ను చూశానని, తనను బంధిస్తే, తప్పించుకుని వచ్చినట్టుగా చెప్పిన నజీబ్, తనకు సాయపడాలని కోరాడని సదరు మహిళ పేర్కొంది. ఈ విషయం అందరికీ తెలిసేలోగా, నజీబ్ అక్కడి నుంచి మరో ప్రాంతానికి వెళ్లి ఉండవచ్చని, లేకుంటే అతన్ని తిరిగి బంధించి ఉండవచ్చని తెలిపింది. ఓ చిరునామా ఇచ్చి తనను అక్కడ కలుసుకోవచ్చని చెప్పింది. కాగా, సదరు మహిళ ఇచ్చిన చిరునామా తప్పని పోలీసులు తేల్చారు. లెటర్ డెలివరీ చేసిన కొరియర్ సంస్థను, అది ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయమై విచారిస్తున్నారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు నజీబ్ ఆచూకీ చెబితే రూ. 5 లక్షల నజరానా ఇస్తామని వెల్లడించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News