: మంచం కింది దాచుకున్న డబ్బును మోదీ బయటకు తెస్తుంటే, ఆ నేతలు తట్టుకోలేకపోతున్నారు!: వెంకయ్య ఎద్దేవా
సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయాన్ని జీర్ణించుకోలేని వారే ఇప్పుడు అసహనంతో ఆయన చేస్తున్న మంచి పనులను విమర్శిస్తున్నారని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆరోపించారు. ప్రజలు ఎంతమాత్రమూ అసహనంతో లేరని, మోదీ అంటే గిట్టని వారే అసహనంతో ఉన్నారని ఏ పార్టీ పేరూ చెప్పకుండానే, నోట్ల రద్దుపై విమర్శిస్తున్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, తృణమూల్ కాంగ్రెస్ నేతలను ఆయన ఎత్తిపొడిచారు. "దేశంలోని అసహనానికి రెండు కారణాలు, ఒకటి వారు ఎన్నికల్లో గెలవలేకపోవడం, రెండవది వారు మంచం కింద దాచుకున్న డబ్బును మోదీ బయటకు తేవడం" అని వెంకయ్యనాయుడు చమత్కరించారు. ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేని ఎంతో మంది నేతలు తట్టుకోలేక, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. వారి పరిస్థితి నవ్వలేక, ఏడవలేక అన్నట్టుందని, అక్రమంగా సంపాదించిన వారి ఆట కట్టించేలా మోదీ చేపట్టిన చర్యలపై సామాన్యులు ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. పెద్ద నోట్ల రద్దుపై వాస్తవాలను ఎంపీలంతా కలసి క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి ప్రజలకు వివరిస్తారని పేర్కొన్నారు.