: నేడు, రేపు పోలీస్ కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్స్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
పోలీస్ కమ్యూనికేషన్, ఫింగర్ ప్రింట్స్ పరీక్షలకు అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని గుంటూరు ఏఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. నేడు, రేపు జరగనున్న పరీక్షల ఏర్పాట్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం ఆయన అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష సమయానికి గంట ముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్ష ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, అలాగే మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. రెండు రోజులపాటు జరిగే పరీక్షలకు మొత్తం 7804 మంది అభ్యర్థులు హాజరుకానున్నట్టు తెలిపారు. వీరిలో పోలీస్ కమ్యూనికేషన్ ఎస్సై అభ్యర్థులు 4109 మంది కాగా, ఫింగర్ ప్రింట్స్ ఏఎస్సై అభ్యర్థులు 1472 మంది అని పేర్కొన్నారు. ఉదయం పరీక్ష రాసిన అభ్యర్థులు తిరిగి మధ్యాహ్నం కూడా పరీక్షకు హాజరు కావాల్సి ఉండడంతో పరీక్షా కేంద్రాల్లోని క్యాంటీన్లలో భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష హాల్లోకి అనుమతించబోమని, నిమిషం ఆలస్యమైనా లోపలికి అనుమతించమని పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు గంట ముందుగానే ఆయా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.