: గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల అభిప్రాయం ఏమిటి?: వెంకయ్య నాయుడు
నిన్న రాజ్యసభలో కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ చేసిన వ్యాఖ్యలపై మిగతా కాంగ్రెస్ నేతల అభిప్రాయం ఏమిటని, వాటిపై వారి స్పందన ఏమిటని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రశ్నించారు. ఈ రోజు పార్లమెంటు వెలుపల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పెద్దనోట్ల రద్దుపై చర్చకు సిద్ధమేనని తాము చెబుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీల నేతలు గందరగోళం ఎందుకు సృష్టిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షాలు అడగాలనుకుంటున్న అన్ని ప్రశ్నలకు తాము సమాధానం చెబుతామని వెంకయ్య నాయుడు అన్నారు. పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అయితే, కాంగ్రెస్ నేతలు సభను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ కచ్చితంగా సభకు హాజరుకావాలని విపక్ష నేతలు ఎందుకు కోరుతున్నారని ఆయన ప్రశ్నించారు. అవసరమైతే ప్రధాని తప్పకుండా వచ్చి సమాధానం చెబుతారని ఆయన తెలిపారు.