: మహారాష్ట్ర బీజేపీ మంత్రికి చెందిన కారులో రూ.91 లక్షల నగదు స్వాధీనం.. ప్రతిపక్షాల విమర్శలు
మహారాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత సుభేశ్ దేశ్‌ముఖ్‌పై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నిన్న సాయంత్రం ఆయన వాహనాన్ని తనిఖీ చేసిన పోలీసులు అందులో ఓ ప్రాంతానికి తరలిస్తోన్న రూ.91 లక్షల నగదు ఉందని గ్రహించారు. ఈ డబ్బంతా సుభేశ్ దేశ్‌ముఖ్‌కి చెందిన లోక్‌మంగల్ గ్రూపుకు సంబంధించినదని, ఈ డబ్బును ఉస్మానాబాద్ మున్సిపాలిటీ వద్ద జరిపిన సాధారణ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అయితే, దీనిపై ఇంతవరకు మంత్రి స్పందించలేదు. దీంతో విపక్షాలు ఆయనపై విమర్శలను గురిపెట్టాయి. ఆయనకు చెందిన బ్యాంకు ఖాతాలతో పాటు ఆయన జరిపిన లావాదేవీలను ఆదాయ పన్ను శాఖ అధికారులు పరిశీలించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేతల వద్ద పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ ఉందని, అందుకు ఈ ఘటనే సాక్ష్యమని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. మంత్రి దేశ్‌ముఖ్‌ను రాష్ట్ర కేబినెట్ నుంచి వెంటనే తొలగించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.