: 2019లో రూ.2 వేల నోటు కూడా రద్దు.. తాత్కాలిక చలామణి కోసమేనంటున్న విశ్లేషకులు!
కేంద్రం పెద్ద నోట్లు రద్దుచేసిన తర్వాత ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసిన ప్రభుత్వం కొత్తగా రూ.2వేలు, రూ.500 నోట్లను చలామణిలోకి తెస్తున్నట్టు ప్రకటించింది. అయితే రూ.2వేల నోటు మనుగడ ఎక్కువకాలం కొనసాగే అవకాశం లేదని నిపుణులు అంటున్నారు. 2019 సాధారణ ఎన్నికల నాటికి ప్రభుత్వం వాటిని కూడా రద్దు చేసే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎదురయ్యే ఇబ్బందులను తాత్కాలికంగా అధిగమించేందుకే రూ.2 వేల నోటును ప్రభుత్వం తెరపైకి తెచ్చినట్టు ఆర్బీఐ వర్గాల అనధికారిక సమాచారం. బ్యాకింగ్ నిపుణులు కూడా రూ.2వేల నోటు రద్దుపై ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. రూ.వెయ్యి, రూ.500 నోట్లను రద్దు చేసి అంతకంటే పెద్దదైన రూ.2వేల నోటును చలామణిలోకి తేవడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. నల్లధనాన్ని నిర్మూలించేందుకే పెద్దనోట్ల రద్దు అని చెబుతున్న ప్రభుత్వం అంతకంటే పెద్ద నోటును ఎలా తెస్తుందని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.