: సభలో ఢిల్లీ ముఖ్యమంత్రికి చేదు అనుభవం.. 'కేజ్రీవాల్ చోర్ హై' అంటూ వ్యాపారుల నినాదాలు
పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్లో నిర్వహించిన సభలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. సభ జరుగుతున్న సమయంలో సభా ప్రాంగణంలో అతికించిన కేజ్రీవాల్ పోస్టర్లను చింపేసిన కొందరు వ్యాపారులు.. కేజ్రీవాల్ చోర్ హై, కేజ్రీవాల్ డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాను అధికారంలోకి వస్తే దేశంలోనే అతిపెద్దదైన ఆజాద్‌పూర్ మార్కెట్లోని వ్యాపారుల సమస్యలు తీరుస్తానని అప్పట్లో కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. అయితే గెలిచిన తర్వాత ఆయన ఆ విషయాన్ని పట్టించుకోలేదని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఆయనపై గుర్రుగా ఉన్న వ్యాపారులు గురువారం సభ జరుగుతుండగా సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు పెద్దనోట్ల రద్దు విషయం ఎస్సెల్ గ్రూప్ చైర్మన్, రాజ్యసభ ఎంపీ సుభాష్ చంద్రతోపాటు బీజేపీ మిత్రులైన దేశంలోని నల్లకుబేరులందరికీ ముందే తెలుసని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలపై సుభాష్ చంద్ర కోర్టుకెక్కారు. గురువారం ఆయనపై పాటియాలా హౌస్ కోర్టులో పరువునష్టం దావా వేశారు.