: అభిమాని పట్ల శ్రద్ధాకపూర్ చర్యను తప్పుపడుతున్న సైకాలజిస్టులు!
ప్రముఖ సినీ నటి శ్రద్ధా కపూర్ చేసిన ఓ పనిని సైబర్ క్రైం అధికారులు, మానసిక నిపుణులు తప్పుపడుతున్నారు. ఈ మధ్య శ్రద్ధా కపూర్ ను అభిమానం పేరుతో ఓ వ్యక్తి వెంబడిస్తున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి చేరుకుని, ఆమెను తదేకంగా చూస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో ఏమనుకుందో ఏమో కానీ ఓ వేదికపై కన్నార్పకుండా చూస్తున్న అతనిని పిలిచి, 'తన అభిమాని' అంటూ అందరికీ పరిచయం చేసి, హగ్ ఇచ్చింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అతనితోపాటు అంతా ఆశ్చర్యపోయారు. దీనినే సైబర్ క్రైం అధికారులు, మానసిక నిపుణులు తప్పు పడుతున్నారు. శ్రద్ధా కపూర్ సెలబ్రిటీ కనుక ఆమెకు సెక్యూరిటీ ఉంటుందని, అయితే ఆమెను అభిమానించే అమ్మాయిలు కూడా బయట ఇదే పనిచేస్తే... ఆకతాయిలు మరింత రెచ్చిపోతారని, అఘాయిత్యాలకు పాల్పడతారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీలు కొన్ని పనులు చేసేటప్పుడు ఆలోచించాలని హితవు పలుకుతున్నారు. ఈ మధ్యే సోషల్ మీడియాలో 'చంపుతా' అంటూ తనను బెదిరిస్తున్న ఓ వ్యక్తిపై శ్రుతి హాసన్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.