: అక్కడ విద్యార్థుల పరీక్షల కోసం విమానాలు ఆపేస్తారు, షాపులు మూసేస్తారు...!


పరీక్షలు మొదలైతే షాపులు మూసేయడం, ట్రాఫిక్ ఆపేయడం, విమానాలు నిలిపేయడం వంటి చిత్రాలు ఎక్కడైనా చూశారా? పోనీ చూడాలనుకుంటున్నారా? అయితే మీరు దక్షిణ కొరియా వెళ్లాల్సిందే. అక్కడ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు వచ్చిన ప్రతిసారీ ఇది సర్వసాధారణం. పరీక్ష రాసే విద్యార్థులకు ఎలాంటి అంతరాయం కలుగకుండా ఆ రహదారుల్లో వాహనాలను నిలిపేస్తారు. పరీక్ష కేంద్రం చుట్టుపక్కల షాపులు మూసేస్తారు. ఆకాశంలో విమానాలను కూడా తిరగనియ్యరు. శబ్ద కాలుష్యం వచ్చే ప్రతి పనిని ఆపేస్తారు. తాజాగా ఉన్నత విద్యకు సంబంధించిన ఆరు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరువుతున్నారు. సుమారు ఎనిమిది గంటల పాటు జరిగే ఈ పరీక్షలో గణితం, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతోపాటు భాషా సంబంధమైన పేపర్లు కూడా ఉంటాయి. వీటిల్లో కెరీర్ ను నిర్ణయించేది మాత్రం గణితం, సైన్స్ పేపర్లే. ఇందులో ఆంగ్ల భాషకు సంబంధించి 25 నిమిషాలపాటు విని రాసే పరీక్ష కూడా ఉంటుంది. ఈ సమయంలో శబ్దాలు వినిపిస్తే విద్యార్థులు తప్పులు రాసే ప్రమాదం ఉంది. దీంతో ఈ పరీక్షకు ఇబ్బంది కలుగకుండా అధికారులు ఇంచుమించు కర్ఫ్యూ వాతావరణం ఏర్పరుస్తారు. అంతేకాదు, విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు రావడం ఆలస్యం కాకుండా పోలీసులే ప్రత్యేక ఏర్పాట్లు చేసి, వారిని పరీక్ష కేంద్రాలకు తరలించడం విశేషం. పరీక్ష పూర్తయిన తరువాత మార్కెట్లు, చిన్న అంగళ్లు తిరిగి తెరవడం విశేషం.

  • Loading...

More Telugu News