: రాజ్యసభను ఊపేసిన గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు ఇవే!
రాజ్యసభలో నోట్ల రద్దుపై చర్చ సందర్భంగా గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం కారణంగా, గతంలో యూరీ సెక్టార్ లో జరిగిన ఉగ్రదాడిలో మరణించిన సైనికుల కంటే ఎక్కువ మంది ఇప్పుడు మరణించారని అన్నారు. కేంద్రం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం కారణంగా దేశ వ్యాప్తంగా సుమారు 40 మంది మరణించారని, వీరి మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు. దీనిపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ను విపక్షాలు పొగుడుతున్నాయని మండిపడ్డారు. యురీ ఉగ్రదాడిని నోట్ల రద్దుతో పోల్చడమేంటని ప్రశ్నించారు. ఇలా నోట్ల రద్దును యురీ దాడితో పోల్చినందుకు సభకు క్షమాపణలు చెప్పాలని, రికార్డుల నుంచి ఆయన చేసిన వ్యాఖ్యలు తొలగించాలని ఆయన తీవ్ర ఆగ్రహంతో డిమాండ్ చేశారు. దీనిపై డిప్యూటీ ఛైర్ పర్సన్ స్పందించి, రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటానని తెలిపారు. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. వెంకయ్యనాయుడు డిమాండ్ కు ఆజాద్ దీటుగా సమాధానం చెప్పారు. పాకిస్థాన్ లో జరిగే పెళ్లిళ్ల (నవాజ్ కుమార్తె) కు వెళ్లి వస్తారు, వాళ్లు వస్తే (నవాజ్ షరీఫ్) రెడ్ కార్పెట్ పరుస్తారు. మీరా మమ్మల్ని వేలెత్తి చూపేది? అని మండిపడ్డారు. సభలో కూర్చుని మాట్లాడితే దేశభక్తి అనిపించుకోదని, కశ్మీర్ లో తూటాలకు, సమస్యలకు ఎదురొడ్డి నిలవడమే దేశభక్తి అని ఆయన తెలిపారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార విపక్ష సభ్యుల నినాదాలతో రాజ్యసభ హోరెత్తిపోయింది. దీంతో డిప్యూటీ ఛైర్ పర్సన్ కురియన్ సభను రేపటికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.