: 2.5 లక్షల రూపాయల్లో జైట్లీ కుమార్తెకు పెళ్లి చేసి చూపించగలరా?: కేజ్రీవాల్ సవాల్
పేద ప్రజలంటే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు చిన్నచూపు అని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దెప్పిపొడిచారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన సభలో ఆయన మాట్లాడుతూ, దేశప్రజలు నగదు కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే... వివాహం కోసం 2.5 లక్షల రూపాయలు డ్రా చేసుకోవచ్చని ప్రకటించి కేంద్రం ఉదారత చాటుకుందని ఎద్దేవా చేశారు. దేశ ప్రజల పట్ల అంత ఊదారత చూపిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, అదే 2.5 లక్షల రూపాయల్లో తన కుమార్తె వివాహం జరిపి చూపించి, దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవాలని ఆయన సవాల్ విసిరారు. గతంలో బీజేపీకి చెందిన నేత గాలి జనార్థన రెడ్డి వందల కోట్ల రూపాయలతో తన కుమార్తె వివాహం జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. 'మీ పార్టీకి చెందిన నేతలు వందల కోట్లతో వివాహాలు జరుపుకోవాలి...దేశ ప్రజలు మాత్రం కేవలం 2.5 లక్షల రూపాయలతో వివాహం చేసుకోవాలా? ఇదెక్కడి న్యాయం?...దేశ ప్రజలంటే చులకన భావం ఉండడం వల్లే కదా, ఇలాంటి నిరంకుశ నిర్ణయాలు తీసుకుంటున్నారు?' ఆయన కడిగేశారు. అదే ప్రజలు మిమ్మల్ని భ్రమల్లోంచి వాస్తవంలోకి తీసుకొచ్చే రోజులు ఎంతో దూరంలో లేవని ఆయన హెచ్చరించారు.