: రైతులు, అగ్రి ట్రేడర్స్ కు ఊరట... పెళ్లిళ్లకు తొలగిన కష్టాలు
పెద్ద నోట్ల రద్దుతో జనాలు అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, కొంత వెసులుబాటు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా దేశానికి వెన్నెముక అయిన రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంది. రైతులు వారానికి రూ. 25 వేలు విత్ డ్రా చేసుకోవచ్చని ప్రకటించింది. అంతేకాదు, వ్యవసాయానికి అనుబంధంగా ఉండే అగ్రి-ట్రేడర్స్ వారానికి రూ. 50వేలు విత్ డ్రా చేసుకునేందుకు అనుమతించింది. అయితే ఈ వెసులుబాటును పొందాలనుకునే ట్రేడర్స్ కి రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంతదాస్ ఈ రోజు వెల్లడించారు. వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలు, ఎరువులు లాంటివి కొనే క్రమంలో రైతులు ఇబ్బందులు పడకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతేకాదు, ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లిళ్లను నిర్వహించుకోవడానికి రూ. 2.5 లక్షలను విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే, కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ఈ డబ్బును బ్యాంక్ నుంచి డ్రా చేసుకోవాలి. అంతేకాదు, పెళ్లి కోసం తన కుటుంబంలోని మరెవరూ డబ్బును డ్రా చేసుకోలేదని బ్యాంకులో రాతపూర్వకంగా ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు, పాన్ కార్డు వివరాలను కూడా అందించాలి. మరోవైపు, బ్యాంకుల ద్వారా పాత నోట్లను మార్చుకునే లిమిట్ ను రూ. 4,500 నుంచి రూ. 2000 లకు తగ్గించారు. శుక్రవారం నుంచి ఇది అమల్లోకి వస్తుంది. నోట్ల మార్పిడి, విత్ డ్రా సమయంలో వేలిపై సిరా గుర్తు వేసే కార్యక్రమం మాత్రం కొనసాగనుంది. రైతులు వ్యవసాయ లోన్లు తీసుకోవడానికి ఎలాంటి అడ్డంకులు లేవని... అయితే, వారానికి రూ. 25వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోవాల్సి ఉంటుందని ఆర్థక శాఖ కార్యదర్శి చెప్పారు. కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా కూడా నగదు డ్రా చేసుకోవచ్చని తెలిపారు. తమ ఉత్పత్తులను అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని రైతులు చెక్ లు, ఆర్టీజీఎస్ లాంటి పద్ధతుల ద్వారా కూడా బ్యాంకులో జమ చేసుకోవచ్చని చెప్పారు. పైవాటికి తోడు, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు మరో రెండు నిర్ణయాలను తీసుకుంది. అందులో మెదటిది... క్రాప్ ఇన్స్యూరెన్స్ కు సంబంధించిన పేమెంట్లను చేయడానికి రైతులకు ఉన్న గడువును మరో 15 రోజులకు పెంచుతూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. రెండోది... కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో గ్రూప్-సీ వరకు ఉన్న వారు రూ. 10 వేల వరకు అడ్వాన్స్ గా విత్ డ్రా చేసుకోవడానికి అనుమతించింది. ఈ మొత్తాన్ని నవంబర్ జీతంలో అడ్జస్ట్ చేస్తారు.