: పోడియం వద్దకు వెళ్లొద్దు... ఇతర పార్టీల ఉచ్చులో పడొద్దు!: తమ ఎంపీలకు ఫోన్ చేసిన కేసీఆర్
తమ పార్టీ ఎంపీలకు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేశారు. పార్లమెంటు సమావేశాల సందర్భంగా హుందాగా వ్యవహరించాలని, పోడియం వద్దకు వెళ్లే ప్రయత్నం చేయరాదని ఆయన సూచించారు. సభను అడ్డుకునే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను సభ, ప్రధాని దృష్టికి తీసుకెళ్లాలని... అదే సమయంలో సభను స్తంభింపజేయడానికి ఇతర పార్టీలు వేసే ఉచ్చులో పడరాదని సూచించారు. అసలు విషయాన్ని వదిలేసి, ఇతర పార్టీలు చేసే ప్రయత్నాలకు సహకరించవద్దని చెప్పారు. ప్రధాని మాట్లాడిన తర్వాత, నోట్ల రద్దుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సభలో ప్రస్తావించాలని సూచించారు. సమస్యలను తగిన విధంగా ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళదామని తెలిపారు. పార్లమెంటులో తమ వైఖరి రాష్ట్ర ప్రయోజనాలు, ప్రజల పక్షంగా ఉండాలని ఆదేశించారు.