: రియల్ 'పున్షుక్ వాంగ్డూ' అద్భుత ఆలోచనకు ప్రతిష్ఠాత్మక అవార్డు
పున్షుక్ వాంగ్డూ... 2009లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'త్రీ ఈడియట్స్'లో అమీర్ ఖాన్ పోషించిన పాత్ర. ఒక్కసారి సినిమా చూసిన వారికి సైతం జీవితాంతమూ గుర్తుండిపోయేటన్ని అనుభూతులను మిగిల్చే పాత్ర ఇది. అటువంటి పాత్ర పోషించేందుకు అమీర్ ఖాన్ కు స్ఫూర్తిగా నిలిచిన రియల్ పున్షుక్ వాంగ్డూ, సోనమ్ వాంగ్ చుక్ కు 2016కు గాను ప్రతిష్ఠాత్మకమైన రోలెక్స్ అవార్డు లభించింది. ఇప్పటికే తన ప్రయోగాలు, పరీక్షలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న వాంగ్ చుక్ చేపట్టిన 'మంచు స్థూపం' ప్రాజెక్టుకు ఈ గుర్తింపు లభించింది. లడఖ్ రీజియన్ లో నివాసం ఉంటున్న 50 ఏళ్ల సోనమ్ వాంగ్ చుక్, ఈ ప్రాంతంలో వ్యవసాయానికి నీటి కొరతను లేకుండా చేసేందుకు భారీ ఎత్తున మంచు స్థూపాలను నిర్మించాలని, వాటి చుట్టూ చెరువులు, రిజర్వాయర్లు నిర్మించడం ద్వారా హిమాలయా పర్వత సానువుల్లో నీటి కొరత లేకుండా చేయవచ్చని వెల్లడిస్తూ, ప్రాజెక్టు చేపట్టారు. సముద్ర మట్టానికి 3,500 మీటర్ల ఎత్తున ఓ 'ఐస్ స్థూపాస్' ప్రాజెక్టు చేపట్టి దాన్ని విజయవంతం చేసి చూపారు. నీరు గడ్డకట్టినప్పుడు దాన్ని తరలించి ఓ కొండ మాదిరిగా పేర్చితే, ఆపై సీజన్ మారగానే అది కరిగి నీటిని అందిస్తుందన్నది వాంగ్ చుక్ ఆలోచన. 30 మీటర్ల ఎత్తుండే 20కి పైగా మంచు స్థూపాలను నిర్మించడం ద్వారా కోట్లాది లీటర్ల నీటిని అందించవచ్చన్నది ఆయన ఆలోచన.