: మనది బట్లర్ ఇంగ్లిషేనట!.. ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ ర్యాకింగ్‌లో దిగజారిన ఇండియా ర్యాంకు
భారతీయుల ఇంగ్లిష్ పరిజ్ఞానం అంతంత మాత్రమేనని స్వీడన్‌కు చెందిన ఎడ్యుకేషన్ ఫస్ట్ (ఈఎఫ్) అనే విద్యావేదిక పేర్కొంది. ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ ర్యాంకింగ్స్‌లో భారత్ గతేడాదితో పోలిస్తే రెండు ర్యాంకులు దిగజారి 22వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. 9.50 లక్షల మంది పెద్దలకు సంబంధించిన ఇంగ్లిష్ పరీక్షల పలితాలను పరిశీలించి ఈఎఫ్ ఈ నివేదికను విడుదల చేసింది. ఈ విషయంలో చైనా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. చైనాలో క్రమంగా ఇంగ్లిష్‌లో నాణ్యత పెరుగుతుందని పేర్కొన్న ఈఎఫ్ఎ ఆ దేశంలో ఇంగ్లిష్ ఇంకా బేసిక్ స్థాయిలోనే ఉందని తెలిపింది. ఇంగ్లిష్‌కు డ్రాగన్ కంట్రీ అత్యంత ప్రాధాన్యం ఇస్తూ ఆ దిశగా చర్యలు తీసుకుంటుండడంతో గతేడాది 39వ ర్యాంకులో ఉన్న చైనా ఏకంగా 8 స్థానాలు ఎగబాకి 31వ ర్యాంకు వద్ద ఆగింది. ఈఎఫ్ మొత్తం 72 దేశాలకు ఇంగ్లిష్ భాషపై ర్యాంకులు ప్రకటించింది. దాయాది దేశం పాక్ 48వ స్థానంలో నిలిచింది. చైనాకంటే మనం కాస్త ముందు వరుసలో ఉండడం ఊరటనిచ్చే విషయమే అయినా గతేడాది కంటే రెండు స్థానాలు దిగజారడం మాత్రం ఆందోళన చెందాల్సిన విషయమేనని స్వీడన్‌లోని భారతీయులు అంటున్నారు.