: 'డాడీ! నాకు ఇడ్లీ కావాల'న్న కూతురు.. నోట్ల రద్దుతో కుమార్తె ఆకలి తీర్చలేకపోయిన యువ హీరో విజయ్ సేతుపతి
నోట్ల రద్దు కష్టాలు పేదలనే కాదు, సినిమా హీరోలను కూడా ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో కుమార్తె ఆకలి తీర్చలేకపోయానని తమిళ యువహీరో విజయ్ సేతుపతి ఆవేదన వ్యక్తం చేశాడు. పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు మోదీ ప్రకటించిన రోజున తన కుమార్తె జ్వరంతో బాధపడుతోందని, ఆస్పత్రిలో చూపించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఇడ్లీ కావాలని అడిగిందని తెలిపాడు. అయితే, ఆ సమయంలో తన వద్ద రూ.500, రూ.1000 నోట్లు మాత్రమే ఉన్నాయని, ఆ నోట్లను ఎవరూ తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడ్డానని వివరించాడు. ఓ చేత్తో కుమార్తెను పట్టుకుని చిల్లర కోసం అవస్థలు పడ్డానని పేర్కొన్నాడు. కుమార్తె ఆకలి తీర్చలేకపోయినందుకు తీవ్ర మానసిక వేదనకు గురయ్యానన్నాడు. జేబులో సరిపడా డబ్బులు ఉండి కూడా ఇబ్బందులు పడ్డానని తెలిపాడు. పెద్దనోట్ల రద్దు మంచిదే అయినా అమలులో లోపాల వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారన్నాడు. ముందు జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని విజయ్ పేర్కొన్నాడు.