: 'ట్రంప్ కు ఓటేస్తావా?' అంటూ కొడుకును బయటకు గెంటేసిన తల్లి!
డొనాల్డ్ ట్రంప్ కు ఓటు వేస్తావా? అంటూ తన కుమారుడిని తల్లి కొట్టడమే కాకుండా, ఏకంగా ఇంట్లో నుంచి బయటకు పొమ్మన్న సంఘటన అమెరికాలోని టెక్సాస్ లో జరిగింది. ఇంతకీ ఆ కుర్రాడు ఇలా తన్నులు తిన్నది ఇటీవల అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసినందుకు కాదు, అక్కడి పాఠశాలలో నిర్వహించిన నమూనా ఎన్నికల (మాక్ ఎలక్షన్స్) లో ట్రంప్ గా పోటీ చేసిన విద్యార్థికి ఓటేసినందుకు! ట్రంప్ కు ఓటు వేసిన ఈ విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లి బాలుడిపై ఆగ్రహించింది. అతని బట్టలు, సామాగ్రిని ఒక సూట్ కేసులో పెట్టి, ఇంటి నుంచి బయటకు పొమ్మంది. ట్రంప్ కు ఓటు వేసినందుకు అమ్మ కొట్టిందని, ఇంట్లో నుంచి తనను బయటకు పంపివేసిందని రాసి ఉన్న ఒక బోర్డు కూడా ఆ బాలుడి చేతికి ఇచ్చింది. దీంతో ఏం చెయ్యాలో దిక్కుతోచని ఆ చిన్నారి బాలుడు, బోరున విలపించాడు.. తలుపు తీయమని తల్లిని బతిమలాడాడు. కొంతసేపటి తర్వాత బయటకు వచ్చిన తల్లి, ట్రంప్ కు ఎందుకు ఓటు వేశావని ప్రశ్నించింది. టీవీలో ఎక్కువసార్లు ట్రంప్ నే చూశానని.. అందుకే ఆయనకు ఓటు వేశానని ఆ బాలుడు సమాధానమిచ్చాడు. అయితే, ఈ తతంగమంతా ఎవరో వీడియో తీశారు. దీంతో, సామాజిక మాధ్యమాలకు చేరిన ఆ వీడియో హల్ చల్ చేస్తోంది.