: స్వేచ్ఛ ఇస్తే తునిలో ఏం చేశారో ముద్రగడ ఆలోచించాలి: ఎమ్మెల్యే బోండా ఉమ
ఏపీలో స్వేచ్ఛ లేదంటూ వ్యాఖ్యలు చేసిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ మండిపడ్డారు. ముద్రగడ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదని, ఒకసారి స్వేచ్ఛ ఇస్తే తునిలో ఏం చేశారో ముద్రగడ ఆలోచించుకోవాలని ఆయన హితవు పలికారు. కోర్టు ఆదేశాల ప్రకారమే పోలీసులు వ్యవహరించారని, ఇప్పటివరకు మంజునాథ కమిషన్ ను ముద్రగడ ఎందుకు కలవలేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంపై కక్షతో ముద్రగడ వ్యవహరిస్తున్నారని బోండా ఉమ ఆరోపించారు. కాగా, కిర్లంపూడిలోని తన నివాసం నుంచి ముద్రగడను బయటకు రానీయకుండా, గృహ నిర్బంధం చేయడంతో ఈరోజు ఆయన తలపెట్టిన పాదయాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పోలీసులు తనను గృహనిర్బంధం చేశారని, రాష్ట్రంలో స్వేచ్ఛ లేదని ఆయన వ్యాఖ్యనించారు.