: పెళ్లి వేడుకలో కాల్పులు జరిపిన సాధ్వి, ఆమె శిష్యులు.. ఓ మహిళ మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
పెళ్లి వేడుక జరుగుతుండగా కాల్పులు జరిపిన ఘటన హర్యానాలోని కర్నల్ జిల్లాలో కలకలం రేపింది. సావిత్రి లాన్స్ అనే కల్యాణమండపంలో పెళ్లి వేడుకకి హాజరైన ఆల్ ఇండియా హిందూ మహాసభ వైస్ ప్రెసిడెంట్ సాధ్వి దేవా ఠాకూర్ తో పాటు ఆమెతో వచ్చిన ఆరుగురు శిష్యులు పెళ్లి వేడుకలో భాగంగా గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే అవి గురితప్పి తగలడంతో నలుగురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో 11 ఏళ్ల బాలిక కూడా ఉంది. గాయాలపాలయిన వారిని ఆసుపత్రికి తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సునీత రాణి అనే ఓ మహిళ మృతి చెందింది. మిగతా వారి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాధ్వితో పాటు ఆమె శిష్యులపై ఆయుధాల చట్టం కింద పలు సెక్షన్లతో పాటు హత్య కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వెంటనే సాధ్వి, ఆమె అనుచరులు అక్కడి నుంచి పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.