: గాలి కుమార్తె పెళ్లిపై ఐటీ శాఖకు ఫిర్యాదు... దర్యాప్తుకు రంగం సిద్ధం
ఐరన్ ఓర్ మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం ఈ రోజు బెంగళూరులో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లి కోసం జనార్దన రెడ్డి భారీగా ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలో, బెంగళూరుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ టి.నరసింహమూర్తి ఈ పెళ్లి ఖర్చులకు సంబంధించి ఐటీ శాఖకు ఫిర్యాదు చేశారు. మొత్తం నాలుగు పేజీల ఫిర్యాదులో గాలి జనార్దన్ రెడ్డి పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను ఎగవేశారని నరసింహమూర్తి ఆరోపించారు. కూతురి పెళ్లి కోసం గాలి దాదాపు రూ. 650 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఇంత ఘనంగా పెళ్లి జరిపించడానికి ఆయనకు ఇంత డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో, ఆయనకున్న ఆదాయ మార్గాలు ఏమిటో వెల్లడించాలని కోరారు. దీంతో, పెళ్లి వేడుకపై దర్యాప్తు చేయడానికి ఐటీ శాఖ సిద్ధమయింది.