: రద్దయిన నోట్లను నా దగ్గరే ఉంచుకున్నా.. వాటిపై ఆటోగ్రాఫ్ చేసి ఇస్తా: విరాట్ కోహ్లీ
నల్లధనం, నకిలీ నోట్లను అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు అంశంపై టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్, టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ సానుకూలంగా స్పందించాడు. ఈ నిర్ణయం తనను అమితంగా ఆకట్టుకున్నట్లు వ్యాఖ్యానించాడు. ఈ రోజు విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెద్ద నోట్ల రద్దును మనదేశ రాజకీయ చరిత్రలో ఓ మహత్తర ఘట్టంగా ఆయన అభివర్ణించాడు. ఇటీవల రాజ్‌కోట్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం హోటల్‌కు వెళ్లిన తర్వాత పెద్ద నోట్ల రద్దుతో తనకో అనుభవం ఎదురైందని చెప్పాడు. హోటల్ బిల్లు కట్టే సమయంలో తన వద్ద రద్దు చేసిన 500 రూపాయల నోట్లు ఉన్నాయని, అవి ఇకపై చలామణీలో ఉండవని తెలుసుకొని ఆ నోట్లను మార్పించుకోకుండా తన దగ్గరే భద్రంగా ఉంచుకున్నట్లు తెలిపాడు. వాటిపై ఆటోగ్రాఫ్ చేసి తన అభిమానులకు ఆ నోట్లను ఇస్తానని చెప్పాడు. రేపటి నుంచి విశాఖపట్నంలో ఇంగ్లండ్ తో జరగనున్న రెండో టెస్టు మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు.