: కొత్త ఉద్యోగాలు ప్రకటించనున్న గూగుల్... యూకేలో 3 వేల మందికి చాన్స్!
సెంట్రల్ లండన్ లోని తన క్యాంపస్ ను విస్తరించాలని నిర్ణయించిన గూగుల్, కొత్తగా 3 వేల మందిని విధుల్లోకి తీసుకోనుంది. కింగ్స్ క్రాస్ ప్రాంతంలో అభివృద్ధి చేసిన కొత్త కార్యాలయంలో పనిచేసేందుకు భారీ ఎత్తున ఉద్యోగులను తీసుకోనున్నట్టు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ ఓ ప్రకటనలో తెలిపారు. యూకేలో కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించిన వారికి ఉజ్వలమైన భవిష్యత్తు స్వాగతం పలుకుతుందని చెప్పారు. ఈ కొత్త క్యాంపస్ లో సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుందని అన్నారు. 2018లో ఇది ప్రారంభమవుతుందని, ఆ పాటికి లండన్ లో ఉద్యోగుల సంఖ్య 7 వేలకు చేరుతుందని చెప్పుకొచ్చారు. కాగా, అమెరికా వెలుపల గూగుల్ నిర్మిస్తున్న కంపెనీ సొంత బిల్డింగ్ లలో ఇదే మొదటిది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలుగుతూ తీసుకున్న నిర్ణయం అనంతరం బ్రిటన్ ప్రభుత్వ భరోసాతో లండన్ లో పెట్టుబడులకు గూగుల్ సిద్దమైందని ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.