: హిందూస్థాన్ కి తప్పు చేయడం తెలీదు... పగలూ రాత్రీ కష్టపడి కడుపు నింపుకుంటోంది: ఆనంద్ శర్మ


దేశం పరువు ప్రతిష్ఠలను బీజేపీ బజారు కీడ్చిందని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనంద్ శర్మ మండిపడ్డారు. ప్రపంచ దేశాలన్నీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ నల్లధనంపై ఆధారపడి నడుస్తోందని భావించేలా బీజేపీ చేసిందని ఆయన అన్నారు. రాజ్యసభలో పెద్ద నోట్ల రద్దుపై ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోని ప్రతి చోటా అవినీతికి పాల్పడేవారు ఉంటారని, అలాంటి వారిని పట్టుకుని శిక్షించాలని సూచించారు. అలాకాకుండా దేశప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆయన హితవు పలికారు. హిందుస్థాన్ ఎన్నడూ ఒకరి వద్ద చేయిచాచి ఎరుగదని ఆయన చెప్పారు. హిందుస్థాన్ లోని మెజారిటీ సభ్యులైన రైతులు, శ్రామికులు పగలనక, రాత్రనక శ్రమించి పొట్టనింపుకుంటున్నారని ఆయన అన్నారు. నల్లధనం గురించి ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెబుతోందని, ప్రతి విషయంలోనూ సర్జికల్ స్ట్రయిక్స్ చేశామని చెబుతోందని ఆయన అన్నారు. 'స్విస్ బ్యాంకు ఖాతాలు, నల్లధనం ఎవరి దగ్గర ఏ రూపంలో వున్నాయో జాబితాలు మీ వద్దే ఉన్నాయి. వాళ్లందర్నీ వదిలేసి దేశ ప్రజలపై సర్జికల్ స్ట్రయిక్స్ ఎందుకు చేశారు?' అని ఆయన నిలదీశారు.

  • Loading...

More Telugu News