: తొలిసారిగా గాల్లోకి ఎగిరిన 'రుస్తుం-2'


పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్డీఓ తయారు చేసిన మానవ రహిత యుద్ధ విమానం 'రుస్తుం-2' తొలిసారిగా గాల్లోకి ఎగిరింది. బెంగళూరుకు 200 కిలోమీటర్ల దూరంలోని చల్లకేరె ప్రాంతంలో ఈ యూసీఏవీ (అన్ మ్యాన్డ్ కాంబాట్ ఎయిర్ వెహికిల్)ను విజయవంతంగా పరీక్షించినట్టు డీఆర్డీఓ అధికారులు తెలిపారు. మధ్యస్థ ఎత్తులో సుదూరాలకు (ఎంఏఎల్ఈ - మీడియం ఆల్టిట్యూడ్, లాంగ్ ఎన్య్డూరెన్స్) వెళ్లగలిగేలా తయారు చేసిన ఈ డ్రోన్ తమ అంచనాలన్నింటినీ అందుకుందని వివరించారు. వాస్తవానికి ఈ విమానం 2013లోనే పరీక్ష దశను దాటాల్సి వుండగా, సాంకేతికతను జోడించడంలో కాస్త ఆలస్యం అయింది. ఈ లోగా ఇజ్రాయిల్ కు చెందిన యుద్ధ డ్రోన్లను కొనుగోలు చేయాలన్న ఆలోచన రావడంతో 'రుస్తుం-2' మరింత ఆలస్యమైంది. చివరికి ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ డ్రోన్ల తయారీకి మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో వీటి తయారీ వేగవంతం చేశారు. ఆటోమేటిక్ గా టేకాఫ్, ల్యాండింగ్ లతో పాటు ప్రపంచంలోని అత్యుత్తమ సాంకేతికత, కచ్చితత్వం వీటి సొంతమని డీఆర్డీఓ అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News