: మూడురోజుల్లో పాక్ విడిచి వెళ్లండి... టర్కీ టీచర్లకు హుకుం
మూడు రోజుల్లో తమ దేశం విడిచిపెట్టి వెళ్లిపోవాలని టర్కీకి చెందిన 100 మంది టీచర్లకు పాకిస్థాన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 20 నాటికి కుటుంబ సభ్యులతో సహా ఖాళీ చేసి వెళ్లిపోవాలని, ఏ ఒక్కరూ పాకిస్థాన్ లో కనిపించకూడదని ఈ ఆదేశాల్లో స్పష్టం చేసింది. టర్కీ అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్ రెండు రోజులపర్యటన కోసం ఇస్లామాబాద్ వస్తున్న తరుణంలో పాక్ ప్రకటన ఆసక్తి కలిగిస్తోంది. మొత్తం 108 మంది టీచర్లు పాక్ లో విద్యాబోధన చేస్తున్నారని, వారి వీసాల గడువు పూర్తికావడానికి తోడు, వాటి గడువు పెంచేందుకు ప్రభుత్వం నిరాకరించడంతో వారిని మూడు రోజుల్లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించినట్టు తెలిపారు. వాస్తవానికి టర్కీ టీచర్లు ఉద్యోగం చేస్తున్న పాఠశాలను నడుపుతున్నది అమెరికాలో ముస్లిం మతాచార్యుడిగా ఉన్న పాక్ సంతతికి చెందిన ఫెతుల్లా గులెన్ అనే వ్యక్తి. అతనిని గతంలో టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై ఆగ్రహంతో వారికి పాక్ వీసా పొడిగించలేదని తెలుస్తోంది.