: కాంగ్రెస్ నేతల అవినీతి సొమ్ము రూ. 12 లక్షల కోట్లు: అమిత్ షా
యూపీఏ హయాంలో కాంగ్రెస్ నేతలు అత్యంత అవినీతికి పాల్పడ్డారని... అనేక కుంభకోణాలతో రూ. 12 లక్షల కోట్లు పోగేసుకున్నారని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆ సంపదనంతా రాత్రికి రాత్రి చిత్తుకాగితాలుగా మార్చేశారని... దీంతో, కాంగ్రెస్ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని అన్నారు. ఆదర్శ్, 2జీ, 3జీ, సీడబ్ల్యూజీ, బొగ్గు, విమానాల కొనుగోళ్లు ఇలా ఎన్నో కుంభకోణాలు సోనియా-మన్మోహన్ హయాంలో వరుసగా చోటు చేసుకున్నాయని విమర్శించారు. ఆపరేషన్ చేసిన తర్వాత గాయం మానేంత వరకే నొప్పి ఉంటుందని... నోట్ల రద్దుతో ఏర్పడిన ఇబ్బందులు కూడా అంతేనని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఉద్దేశించి అన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులు తాత్కాలికమే అని చెప్పారు.