: పవన్ కల్యాణ్ అన్న దాంట్లో తప్పేమీ కన్పించడం లేదన్న చంద్రబాబు
ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇటీవల అనంతపురం సభలో చేసిన వ్యాఖ్యల్లో తనకు తప్పేమీ కన్పించడం లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. కేబినెట్ భేటీలో ఆయన మాట్లాడుతూ, వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటుతో రాష్ట్రం ఆవిర్భవించిందని అన్నారు. సమస్యల నుంచి శక్తి వంచనలేకుండా ఈదుకొస్తున్నామని ఆయన చెప్పారు. సమస్యల్లో ఉన్న రాష్ట్రానికి ఏం ఇస్తున్నామో చెప్పడానికే కేంద్రానికి రెండున్నరేళ్లు పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏమిస్తామో చెప్పడానికే రెండేళ్లుపడితే... ఆ నిధులివ్వడానికి మరో రెండున్నరేళ్లు తీసుకుంటే రాష్ట్రానికి ఉపయోగం ఏముందని ఆయన పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ కూడా ఇదే మాట అడిగాడని, అందులో తనకు తప్పేమీ కనిపించడం లేదని ఆయన పేర్కొన్నారు. అవసరమైనప్పుడు రావాల్సిన నిధులు పుణ్యకాలం గడిచిపోయిన తరువాత వస్తే ఉపయోగం ఉండదని ఆయన స్పష్టం చేశారు. సకాలంలో రాష్ట్రానికి నిధులు అందితేనే సమస్యలు పరిష్కరించగలమని ఆయన తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరువాత కేంద్రానికి ఆదాయం పెరిగే అవకాశం ఉందని, రాష్ట్రానికి నిధులు రాబట్టడంపై దృష్టి పెట్టాలని ఆయన పార్టీ ఎంపీలకు సూచించినట్టు సమాచారం.