: గాలి కుమార్తె పెళ్లిపై పడని నోట్ల రద్దు ఎఫెక్ట్... కారణమిదే!
ఒకప్పటి మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె బ్రాహ్మణి వివాహం రేపు బెంగళూరులో ఎంత ఆర్భాటంగా జరగబోతుందో, టీవీ న్యూస్ చానల్స్ చూసిన వారందరికీ ఇప్పటికే ఓ ఐడియా వచ్చేసి ఉంటుంది. ఓ చిన్నపాటి గ్రామాన్ని సృష్టిస్తూ, అత్యంత ఖరీదైన సెట్లు ఇప్పటికే బెంగళూరులో సిద్ధమయ్యాయి. ఈ పెళ్లికి రూ. 400 నుంచి రూ. 500 కోట్ల వరకూ ఖర్చవుతుందని అంచనా. ఇండియాలో పెద్ద నోట్లు రద్దయిన వేళ, గాలి ఇంత ఎక్కువ ఖర్చు పెట్టి ఎలా ఈ పెళ్లి చేయనున్నాడన్న సందేహం అందరిలో నెలకొంది. ఈ ప్రశ్నకు సమాధానం చిక్కింది. పెళ్లికి అలంకరణ ఏర్పాట్ల నుంచి, విందులో వడ్డించే వంటకాల వరకూ అన్ని బాధ్యతలనూ ఓ ఇంటర్నేషనల్ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు ఆరు నెలల క్రితమే అప్పగించారట. అప్పుడే డబ్బులు కూడా వారికి చేరిపోయాయి. ఈ విషయాన్ని సదరు సంస్థలోని ఉద్యోగే బయట పెట్టాడు. ఆరు నెలల నాడు కుదరడం, పైగా భారీ మొత్తం కావడంతో ఆ నోట్లను మార్చుకునే పాట్లేవో తామే పడాలని నిశ్చయించుకున్న సదరు సంస్థ అత్యంత ఆర్భాటంగా వివాహాన్ని జరిపించేందుకు ఏర్పాట్లు చేసేసింది. డబ్బులు ముందే చెల్లించినందునే, నోట్ల రద్దు ఎఫెక్ట్ ఈ పెళ్లిపై లేదన్నమాట!