: నోట్ల రద్దు గురించి ముందే ఎంతో మందికి తెలుసు... సాక్ష్యాలు చూపిన ఉండవల్లి


పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయనున్నారన్న వార్తలు మూడు నాలుగు నెలల ముందు నుంచే ఎంతో మందికి తెలుసునని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ప్రధాని మోదీ నుంచి తన అనుయాయులైన బీజేపీ నేతలకు, మిత్రపక్ష సభ్యులకు ముందుగానే సమాచారం ఇచ్చి వారంతా జాగ్రత్త పడిన తరువాతే నోట్ల రద్దు అంశాన్ని ప్రకటించారని ఆయన ఆరోపించారు. తమ వద్ద ఉన్న కరెన్సీని మార్చుకునేందుకు ఒక్క బడా బాబు కూడా ఇంతవరకూ బ్యాంకుకు రాలేదన్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన, ప్రధాని నిర్ణయంతో పేదలు, సామాన్యులు మాత్రమే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నోట్ల రద్దు తప్పదని, కొత్త రూ. 2 వేలు ముద్రితమయ్యాయని, రూ. 500, రూ. 1000 రద్దు కానున్నాయని వివిధ పత్రికలు గతంలో ప్రచురించిన వార్తలను ఈ సందర్భంగా ఉండవల్లి చూపించారు. నోట్ల రద్దు విషయం ఎంతో మందికి ముందే తెలుసనడానికి ఈ వార్తలే సాక్ష్యమని చెప్పారు. 86 శాతం నగదు పెద్దనోట్ల ద్వారా చలామణి అవుతున్న వేళ, ఎన్ని చిన్న నోట్లు తెచ్చినా ప్రజల కష్టాలు తీరవని ఆయన అన్నారు. పరిస్థితి సాధారణ స్థితికి రావాలంటే, జైట్లీ చెప్పినట్టు రెండు మూడు వారాలు, మోదీ చెబుతున్నట్టు 50 రోజులు సరిపోదని, నెలల నుంచి సంవత్సరాలు పడుతుందని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News