: అమెరికాకు వెళ్తున్న చైనా విద్యార్థుల సంఖ్య తగ్గుతోంటే భారత విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది!


అమెరికాలో ఉన్న‌త చ‌దువును కొన‌సాగించాల‌నుకుంటున్న చైనా విద్యార్థుల సంఖ్య త‌గ్గుతోంద‌ని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఇటీవ‌లే వెల్లడించిన విష‌యం తెలిసిందే. గత ఏడాది అమెరికాకు వెళుతున్న చైనా విద్యార్థుల సంఖ్యలో కేవలం 8 శాతం వృద్ధి మాత్రమే నమోదైందని ప్రకటించింది. మ‌రోవైపు, ఆ దేశంలో చ‌దువును కొన‌సాగిస్తోన్న భార‌తీయ విద్యార్థుల శాతం మాత్రం పెరుగుతోంది. 2015-16 విద్యాసంవ‌త్స‌రంలో అమెరికాలో మొత్తం 1,65,918 మంది భారత విద్యార్థులు ఉన్నారు. దీంతో ఆ దేశంలో చ‌దువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో మ‌న దేశీయులు రెండో స్థానంలో నిలిచారు. అమెరికాలో చ‌దువుకుంటున్న‌ చైనా విద్యార్థుల సంఖ్యలో 8 శాతం మాత్ర‌మే వృద్ధి ఉండ‌గా గ‌త‌ ఏడాదితో పోల్చితే భార‌తీయ విద్యార్థుల సంఖ్య 25శాతం ఎక్కువగా ఉంది. ఈ విష‌యాన్ని ‘ఓపెన్‌ డోర్స్‌’ నివేదికలో చెప్పారు. అమెరికాలో 2015-16 సంవ‌త్స‌రంలో మొత్తం 10,44,000 మంది విదేశీ విద్యార్థులు త‌మ ఉన్న‌త చ‌దువును కొన‌సాగించారు. విదేశీ విద్యార్థుల సంఖ్య ఇంత మొత్తంలో నమోదు కావడం ఆ దేశంలో ఇదే మొద‌టి సారి. విదేశీ విద్యార్థుల సంఖ్య గ‌త‌ ఏడాదితో పోల్చితే 7 శాతం వృద్ధి చెందింది. ఆ దేశంలో ఉన్న మొత్తం విద్యార్థుల్లో విదేశీ విద్యార్థులు ఐదు శాతంగా ఉన్నారు. బ్రిట‌న్‌తో ఈ సంఖ్య‌ను పోల్చితే అమెరికాలో విదేశీ విద్యార్థుల సంఖ్య రెట్టింపుగా ఉంది. భార‌త్‌, అమెరికాల మ‌ధ్య‌ ప్రజాసంబంధాలు మ‌రింత బలోపేతం కావ‌డానికి ఉన్నత విద్యది ముఖ్య పాత్ర అని భారత్ లోని అమెరికా రాయబారి రిచర్డ్‌ వర్మ అన్నారు. మ‌రోవైపు అమెరికా విద్యార్థులు కూడా భారత్‌కు వ‌చ్చి ఉన్న‌త విద్యను అభ్య‌సిస్తున్నార‌ని చెప్పారు. విదేశాల్లో అమెరికన్లు ఉన్న‌త విద్య‌ను కొన‌సాగించాల‌నుకుంటున్న 25 ప్రాధాన్య దేశాల్లో ప్ర‌స్తుతం భారత్ ది 13వ స్థానం అని ఆయన పేర్కొన్నారు. భార‌త్‌లో విద్యనభ్య‌సించాల‌నుకుంటున్న అమెరికన్లకు తమ ప్రభుత్వ రుణాలు కూడా స‌మ‌ర్థ‌వంతంగా అందుతున్నాయ‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News