: ట్రంప్‌ను హిట్లర్‌తో పోల్చిన అమెరికా స్కూల్ టీచర్.. సస్పెండ్ చేసిన స్కూలు యాజమాన్యం


అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను నాజీ డిక్టేటర్ హిట్లర్‌తో పోల్చిన ఓ అమెరికా స్కూల్ టీచర్ ఉద్వాసనకు గురయ్యారు. కాలిఫోర్నియా బే ఏరియాలోని మౌంటైన్ వ్యూ హైస్కూల్‌లో ఫ్రాంక్ నావర్రో(65) 40 ఏళ్లుగా విద్యార్థులకు చరిత్ర పాఠాలు బోధిస్తున్నారు. ఇటీవల ఆయన పిల్లలకు పాఠాలు బోధిస్తూ అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ను ప్రపంచాన్ని గడగడలాడించిన నాజీ డిక్టేటర్ హిట్లర్‌తో పోల్చారు. ‘‘జర్మనీని మరోమారు గొప్పగా తీర్చిదిద్దుతా అని హిట్లర్ చెప్పాడు. ఇప్పుడు ట్రంప్ కూడా అమెరికాను మరోమారు గొప్పగా తీర్చిదిద్దుతానని చెప్పారు’’ అని నావర్రో చెప్పారు. అంతేకాదు, ఇద్దరు నేతలూ కూడా దేశం నుంచి విదేశీయులను తరిమివేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ట్రంప్‌ను హిట్లర్‌తో పోలుస్తూ టీచర్ చెప్పిన విషయాన్ని ఓ విద్యార్థి తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు స్కూలు యాజమాన్యానికి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన స్కూలు యాజమాన్యం నావర్రోను విధుల నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై నిరసన వ్యక్తం చేసిన నావర్రో తాను ఏమీ తప్పుగా మాట్లాడలేదని, చరిత్రను మాత్రమే ఉటంకించానని పేర్కొన్నారు. కావాలంటే చరిత్రను తిరగేసుకోవచ్చని సవాలు విసిరారు. స్కూలు చర్య వాక్ స్వాతంత్ర్యాన్ని హరించేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా బే ఏరియాలో ట్రంప్ విజయానికి వ్యతిరేకంగా నిసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News