: ప్రొఫెసర్ లక్ష్మి పోలీసులకు పట్టుబడిన వైనం!


మెడికల్ కాలేజీ విద్యార్థిని బాలసంధ్యారాణి ఆత్మహత్య కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మి సోమవారం బెంగళూరులో పోలీసులకు చిక్కారు. మూడు వారాలుగా పరారీలో ఉన్న ఆమెను పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేశారు. బెంగళూరులో ఆమెను అదుపులోకి తీసుకున్న సమయంలో పోలీసులతో వాగ్వాదం కూడా జరిగినట్టు తెలుస్తోంది. వైవాహిక సమస్యల కారణంగానే సంధ్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులతో ఆమె వాగ్వాదానికి దిగారు. సంధ్య ఆత్మహత్య తరువాత పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు లక్ష్మి చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. సెల్‌ఫోన్‌ను పక్కనపడేశారు. ఏటీఎం కార్డును సైతం ఎక్కడా ఉపయోగించలేదు. దీంతో ఆమెను పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఒంగోలు, చెన్నై, పాండిచ్చేరి, షోలాపూర్, హైదరాబాద్‌లలో గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఇక లాభం లేదనుకుని లక్ష్మి భర్త, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, బంధువుల ఫోన్లపై పోలీసులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి లక్ష్మికి సహకరించిన గుంటూరు వాసి తేళ్ల హరిబాబు ఫోన్ నుంచి వెళ్లిన ఓ కాల్‌పై నిఘా పెట్టిన పోలీసులకు ఆమె ఆచూకీపై స్పష్టత వచ్చేసింది. బెంగళూరు నుంచి హరిబాబు బంధువులు, స్నేహితులకు ఓ నంబరు నుంచి ఫోన్ వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. దాని ఆధారంగా సోమవారం ఉదయం పోలీసులు బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక డీజీపీ ఓంప్రకాశ్‌కు ఏపీ డీజీపీ సాంబశివరావు సమాచారం ఇచ్చారు. బెంగళూరులోని బంధువుల ఇంట్లో తలదాచుకున్న ప్రొఫెసర్ లక్ష్మి, ఆమె భర్త, ఆశ్రయం ఇచ్చిన బంధువు కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News