: ‘అఖిల్ వివాహ నిశ్చితార్థ వేడుకకు మీరు తప్పకుండా రావాలి’.. కేసీఆర్‌ను కలిసి, ఆహ్వానించిన నాగార్జున
ప్రముఖ సినీనటుడు నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ వివాహ నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం దగ్గరపడింది. ఆ వేడుకకు ప్రముఖులను ఆహ్వానించే పనిలో నాగార్జున బిజీబిజీగా ఉన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ శ్రియా భూపాల్‌తో అఖిల్‌కు వచ్చేనెల 9న నిశ్చితార్థం జరగనున్నట్లు ఇటీవలే నాగార్జున తెలిపిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు రావాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నాగార్జున ఆహ్వానించారు. హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిసిన నాగార్జున తన కుమారుడి నిశ్చితార్థ వేడుకకు తప్పకుండా రావాలని చెప్పారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా కేసీఆర్‌ను కలవడం విశేషం. దత్తాత్రేయ తన కుమార్తె వివాహ వేడుకకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్, దత్తాత్రేయ, నాగార్జున ముగ్గురు కలిసి కాసేపు మాట్లాడుకున్నారు.