: నా కంటే ఆ నలుగురు పిల్లలే బాగా నటించారు: అమీర్ ఖాన్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గొప్పనటుడని అంతా అంగీకరిస్తారు. అలాంటి అమీర్ ఖాన్ తన కంటే తన కుమార్తెలుగా నటించిన నలుగురు పిల్లలే బాగా నటించారని కితాబునిచ్చాడు. 'దంగల్' ప్రమోషన్ సందర్భంగా అమీర్ మాట్లాడుతూ, తన పాతికేళ్ల సినీ కెరీర్ లో ఇంత టాలెంటెడ్ పిల్లలను ఇంతవరకు చూడలేదని అమీర్ అన్నాడు. వారి గురించి గొప్పలు చెబుతున్నానని అనుకోవద్దని, సినిమా చూస్తే ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారని చెప్పాడు. ఈ సినిమాలో పిల్లల పాత్రలే కీలకం కనుక పాత్రలకు తగ్గ నటీనటులు కనిపిస్తేనే సినిమా షూటింగ్ ప్రారంభించాలని భావించామని అన్నాడు. రెజ్లింగ్ సన్నివేశాల సమయంలో శారీరకంగా బలంగా కనిపించాలని, అందుకే ఆ పాత్రలకు తగ్గా ఆర్టిస్టుల కోసం తీవ్రంగా శ్రమించామని చెప్పాడు. కాగా, ఈ నాలుగు పాత్రల్లో ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రా, సుభానీ, జైరా వసీం నటించారు. ఈ సినిమాలో నటనకు మార్కులు ఇవ్వాల్సి వస్తే ఈ పిల్లలకే ఎక్కువ మార్కులు ఇస్తానని, తన కంటే పది రెట్లు బాగా నటించారని అమీర్ తెలిపాడు.