: రూ.24 వేల నగదును ఖాతాదారుడు ఒకేరోజైనా సరే తీసుకోవచ్చు: కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి
ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి శక్తికాంత దాస్ తెలిపారు. ఈ రోజు న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజలు భయపడాల్సిన అవసరం ఏ మాత్రం లేదని, కొన్ని రోజుల్లో అన్ని బ్యాంకులు, ఏటీఎంలలో పూర్తి స్థాయిలో నగదు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని తపాల కార్యాలయాల్లోనూ నగదు డిపాజిట్ కు ఇబ్బందులు ఉండబోవని తెలిపారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా నోట్ల మార్పిడి, విత్ డ్రా పరిమితిని పెంచామని శక్తికాంత దాస్ అన్నారు. బ్యాంకుల్లో వారానికి నగదు విత్ డ్రా పరిమితిని రూ.24 వేలకు పెంచినట్లు, రూ.24 వేల నగదును ఖాతాదారుడు ఒకేరోజైనా సరే తీసుకోవచ్చని తెలిపారు. ఏటీఎంల వద్ద భద్రత పెంచేందుకు టాస్క్‌ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకుల్లో రూ.2.50 లక్షలు ఆపై డిపాజిట్ చేస్తే ఆధారాలు చూపాలని చెప్పారు.