: నేను ఏదైనా తప్పు చేసివుంటే ఏ శిక్షకైనా సిద్ధం: ప్రధాని మోదీ
నల్లధనం నిర్మూలనలో పెద్దనోట్ల రద్దు నిర్ణయం ఎంతో ముఖ్యమైనదని ప్రధాని మోదీ అన్నారు. ఈ రోజు గోవాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ... తనకు ప్రజలు అవినీతిని అంతం చేసేందుకే అధికారం అప్పజెప్పారని, మరి దాన్ని అంతం చేయకుండా ఎలా ఉండగలనని ప్రశ్నించారు. ప్రస్తుతం సామాన్యులు ఎదుర్కుంటున్న ఇబ్బందులు చూస్తుంటే తనకు కూడా బాధ వేస్తోందని, తాను ఏదైనా తప్పు చేసివుంటే ఏ శిక్షకైనా సిద్ధమని పేర్కొన్నారు. తాము తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో 50 రోజుల పాటు కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పారు. బినామీ ఆస్తులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. 2జీ స్కామ్ నిందితులు కూడా ఇప్పుడు పాత నోట్లను మార్చుకోవడానికి బ్యాంకుల వద్దకు వెళ్లి క్యూలో నిలబడుతున్నారని ఆయన చెప్పారు. నల్లధనాన్ని అంతం చేసే వరకు తాను విశ్రమించనని చెప్పారు.