: కష్టాలు ఉన్నాయని నాకు తెలియదా? నెమ్మదిగా తీరుస్తాం: మోదీ


పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు కొన్ని కష్టాలు అనుభవిస్తున్నారన్న సంగతి తనకు తెలుసునని, ఈ విషయంలో తనకూ బాధగానే ఉందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం గోవాలో రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన మోదీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు గోవాలోని ఎయిర్ పోర్టును గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుగా మార్చే ప్రాజెక్టుతో పాటు పణాజిలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఆపై మోదీ ప్రసంగిస్తూ, చాలా మంది పెళ్లిళ్లు, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని, చిల్లర లేక ఇబ్బందులు పడుతున్నారని తన దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలనూ యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఏదైనా మంచి మార్పును చూడాలని భావించే వేళ, ఈ తరహా కష్టాలు తప్పవని మోదీ అభిప్రాయపడ్డారు. తన నిర్ణయాన్ని ప్రజలంతా అంగీకరించారని, ఈ విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోబోనని అన్నారు. తన జీవితం ప్రజల కోసమే అంకితమని, ప్రజల కోసమే జీవిస్తానని, ప్రజల కోసమే మరణిస్తానని చెప్పిన ఆయన, నోట్ల రద్దుపై తనకు బాసటగా నిలిచిన ప్రతి పౌరుడికీ సెల్యూట్ చేస్తున్నట్టు ప్రకటించారు. రాత్రికి రాత్రి తాను తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించిన కోట్లాది మంది ప్రశాంతంగా నిద్రపోగా, ఇంట్లో నల్లధనాన్ని ఉంచుకున్న వారికి మాత్రమే నిద్రలేకుండా పోయిందని ఆయన అన్నారు. మరికొంత మందికి ఇప్పటికీ నిద్రపట్టడం లేదని అన్నారు. 60 సంవత్సరాల రోగాన్ని పోగొట్టేందుకు ఆరు రోజులైనా పట్టదా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News