: సీపీఎంతో కలసి నడుస్తామని మమతా బెనర్జీ ఆసక్తికర ప్రకటన


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నోటి నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వచ్చాయి. దేశం కోసం సీపీఎంతో కలసి పనిచేసేందుకు తాను సిద్ధమేనని ఆమె ప్రకటించారు. పెద్ద నోట్లను రద్దు చేస్తూ, మోదీ ప్రకటించిన నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ, "సీపీఐ-ఎంతో మాకు భావ సారూప్యత ఉండకపోవచ్చు. సిద్ధాంతాల పరంగా వేర్వేరు కావచ్చు. కానీ, వారితో కలసి పనిచేసేందుకు సిద్ధం. మోదీ నుంచి దేశాన్ని, దేశ ప్రజలను కాపాడేందుకు కాంగ్రెస్, సమాజ్ వాదీ, బీఎస్పీ లతోనూ కలసి పనిచేస్తాం" అని ఆమె మీడియాతో వ్యాఖ్యానించారు. ప్రధాని నోటి నుంచి పెద్ద నోట్లను రద్దు చేస్తామన్న మాటలు రావడానికి గంటల ముందు కోల్ కతాలోని బీజేపీ ఖాతాలో మూడు కోట్ల రూపాయలను డిపాజిట్ చేసినట్టు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్న పత్రికలో సాక్ష్యాధారాలతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన నేపథ్యంలో మమత వ్యాఖ్యానించారు. కాగా, తమకు ఈ డబ్బు డిపాజిట్ చేసిన సమయంలో ఎన్నో అనుమానాలున్నాయని సీపీఐ-ఎం నేత సుజన్ చక్రవర్తి అన్నారు. ముందుగా వారికి విషయం తెలిసినందునే డిపాజిట్ చేశారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News