: తమిళనాట మారుతున్న రాజకీయం... తిరిగి డీఎంకేలోకి వస్తున్న అళగిరి!
కరుణానిధి కుమారుడు, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అళగిరి, తిరిగి డీఎంకేలో చేరేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కరుణానిధి అస్వస్థతకు గురైన వేళ అళగిరి స్వయంగా వచ్చి పరామర్శించడం, ఆపై, ఆయన కోలుకున్న తరువాత రహస్య మంతనాలు జరపడం ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లిన ఆళగిరి, శుక్రవారం నాడు చెన్నైకి తిరిగి వచ్చి, ఆ వెంటనే గోపాలపురంలోని కరుణానిధి నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతుండగా, తన కార్యకర్తలు, మద్దతుదారులు డీఎంకేకు అనుకూలంగా ప్రచారం చేస్తున్నారని, వ్యతిరేకంగా పనిచేయడం లేదని అళగిరి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. గతంలో మధురై ప్రాంతాన్ని డీఎంకేకు కంచుకోటగా మార్చిన వ్యక్తిగా అళగిరికి ఆ ప్రాంతంలో కార్యకర్తల బలం దండిగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను తిరిగి పార్టీలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.