: సచిన్ కి, కోహ్లీకి పోలిక లేదు: గిల్ క్రిస్ట్
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య పోలిక సరికాదని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ వ్యాఖ్యానించాడు. కర్ణాటకలోని మణిపాల్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో గిల్ క్రిస్ట్ మాట్లాడుతూ, సచిన్, కోహ్లీ ఇద్దరూ వేర్వేరు తరాలకు చెందిన వ్యక్తులని అన్నాడు. సచిన్ ముందు తరానికి చెందిన క్రికెటరైతే, ఆ తరువాత జనరేషన్‌కు చెందిన క్రికెటర్ కోహ్లీ అని గుర్తుచేశాడు. సచిన్ ఆట స్టాండర్డ్ గా ఉంటుందని, అతనిని తరచూ ఔట్ చేయడం కష్టం అనిపిస్తుందని అన్నాడు. కోహ్లీ అలా కాదని, ఒక ప్రత్యర్ధిగా అవకాశమిచ్చినట్టే కనబడి, వెంటనే దాన్ని అధిగమించగల సత్తా కోహ్లీ సొంతమని చెప్పాడు. తానాడిన సమయంలో తానెదుర్కొన్న ప్రత్యర్ధుల్లో సచినే ఉత్తమమని గిల్ క్రిస్ట్ స్పష్టం చేశాడు. కోహ్లీ కెరీర్ ముగిసే సమయానికి సచిన్ కు దగ్గరగా చేరుకోవడం ద్వారా ప్రపంచ ఉత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలవగలుగుతాడని గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. సచిన్ తాను సాధించిన 34357 పరుగుల్లో పావు వంతు శాతం సెంచరీల ద్వారానే సాధించాడన్న విషయాన్ని గిల్ గుర్తుచేశాడు. ఈ మొత్తం పరుగులు రెండో స్థానంలో ఉన్న సంగక్కర చేసిన పరుగుల కంటే 6341 పరుగులు ఎక్కువని అన్నాడు. కాగా, సచిన్ మొత్తం 100 అంతర్జాతీయ సెంచరీలు నమోదు చేశాడు. ఇక కోహ్లీ మొత్తం 12781 పరుగులు చేయడం విశేషం.