: అవసరమైతే చంద్రబాబుతో కేసీఆర్ మాట్లాడుతారు.. సంధ్యారాణి తల్లిదండ్రులకు కేటీఆర్ హామీ
గుంటూరు వైద్య కళాశాలలో మెడికో సంధ్యారాణి ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్ లక్ష్మికి శిక్ష పడేలా చూస్తామని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతోనే ప్రొఫెసర్ లక్ష్మి అరెస్టు కాకుండా తప్పించుకుంటున్నారని సంధ్యారాణి తల్లిదండ్రులు హైదరాబాదులో కేటీఆర్ ను కలిసి విన్నవించుకున్నారు. ప్రొఫెసర్ లక్ష్మి వేధించడంతోనే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సంధ్యారాణి తన సూసైడ్ నోట్ లో స్పష్టంగా పేర్కొందని మంత్రికి వారు వివరించారు. మరో రెండు నెలలు పోతే తమ కూతురు వైద్యవిద్య పూర్తయ్యేదని, ఆమె వేధింపులు తట్టుకోలేక సంధ్యారాణి తీవ్ర మనోవేదన అనుభవించి ఆత్మహత్యకు పాల్పడిందని వారు కన్నీటిపర్యంతమయ్యారు. దీంతో స్పందించిన కేటీఆర్ వెంటనే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తో ఫోన్ లో మాట్లాడారు. జరిగిన దారుణంపై చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. వేధింపుల ప్రొఫెసర్ ను శిక్షించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం ఏపీ డీజీపీ సాంబశివరావుతో కూడా ఫోన్ లో మాట్లాడి కేసులో పురోగతిని అడిగి తెలుసుకుని, ఆమెను గాలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. బాధితులకు న్యాయం జరిగేలా చూసేందుకు మృతురాలి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. లక్ష్మి భర్తను కూడా ఉద్యోగం నుంచి తప్పిస్తామన్నారని ఆయన చెప్పారు. ఈ విషయంలో అవసరమైతే ఏపీ సీఎం చంద్రబాబునాయుడుతో తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడతారని సంధ్యారాణి కుటుంబానికి కేటీఆర్ హామీ ఇచ్చారు.