: దూకుడుగా ఆడుతున్న ఇంగ్లండ్... సెంచరీ దాటిన భాగస్వామ్యం
రాజ్ కోట్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్ ను ఇంగ్లండ్ జట్టు ధాటిగా ప్రారంభించింది. తొలి ఇన్నింగ్స్ లో 49 పరుగుల ఆధిక్యంతో ఉన్న ఇంగ్లండ్ జట్టు ఓపెనర్లు కెప్టెన్ కుక్ (45), హసీబ్ హమీద్ (59) దూకుడుగా ఆడుతున్నారు. వీలైనంత భారీ స్కోరు సాధించి, భారత్ కు బ్యాటింగ్ అప్పగించడం ద్వారా ఐదో రోజు (రేపు) ఒత్తిడి పెంచవచ్చని కుక్ భావిస్తున్నాడు. దీంతో ఇద్దరూ బ్యాట్లు ఝుళిపిస్తూ వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. టెస్టుల్లో అరంగేట్రం చేసిన హమీద్ రాణించడంతో అతనిని ప్రోత్సహించేందుకు అతని కుటుంబం మొత్తం లండన్ నుంచి రాజ్ కోట్ కు చేరుకుంది. హమీద్ అర్ధ శతకం పూర్తి చేయగానే స్టాండింగ్ ఒవేషన్ తో వారంతా అతనిని చప్పట్లతో అభినందించారు. టెస్టుల్లో తొలి అర్ధ శతకం బాదిన హమీద్, బ్యాట్ కూడా పైకి ఎత్తకుండా మరో ఎండ్ లో ఉన్న కెప్టెన్ కుక్ కు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఇంగ్లండ్ వికెట్లేమీ కోల్పోకుండా 35 ఓవర్లలో 110 పరుగులు చేసింది.