: వృద్ధ మహిళల తగవు పరిష్కారానికి బాక్సింగ్ పోటీ!
ఇద్దరు వృద్ధ మహిళల తగవు వారికే కాదు, థాయ్ లాండ్ లోని ఆ గ్రామం మొత్తానికి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో, ఆ గ్రామ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ సమస్యను వాళ్లంతట వాళ్లే పరిష్కరించుకునేలా ఒక మార్గం చూపారు. ఆ మార్గమేమిటనుకున్నారు, బాక్సింగ్ పోటీ! అవును, ఆ ఇద్దరికి బాక్సింగ్ పోటీ పెట్టారు. ఈ పోటీలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ల మాటను ఓడిపోయినవారు వినాలన్నది షరతు. ఇంతకీ, ఈ బాక్సింగ్ పోటీ ఎక్కడ జరిగిందంటే.. ఆ గ్రామంలోని చెరువు మధ్యలో. ఆ చెరువు మధ్యలో రెండు కర్రలను పెట్టి వాటికి మధ్యలో అడ్డంగా మరో కర్రను కట్టారు. ఆ కర్రకు చెరొవైపు చేరారు. ఒక బామ్మ ఎరుపు రంగు, మరో బామ్మ బ్లూ రంగు గ్లౌజులను ధరించి బరిలో దిగారు. గ్రామస్తుల ప్రోత్సాహం మధ్య సాగిన ఆ పోటీలో బ్లూ రంగు గ్లౌజులు ధరించిన బామ్మ విజేతగా నిలిచింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే, అరవై సంవత్సరాల వయసున్న ఆ బామ్మలిద్దరూ ఒకప్పుడు మంచి స్నేహితులట. ఏదో విషయమై జరిగిన చిన్న గొడవ వారిని విడగొట్టింది.