: భాగ్యనగరంలో ట్రంప్ సంస్థ నిర్మించే టవర్లు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్ అంతకుముందు వ్యాపారవేత్త, రియల్టర్ అనే విషయం తెలిసిందే. ఉత్తర అమెరికా తర్వాత భారత్ లోని రియల్ ఎస్టేట్ రంగంపై డొనాల్డ్ ట్రంప్ సంస్థకు బాగా ఆసక్తి ఉందట. భారత్ లోని లగ్జరీ గృహాల మార్కెట్ పై దృష్టిసారించిన ట్రంప్ సంస్థ ప్రస్తుతం 1.5 బిలియన్ డాలర్ల విలువ గల ఐదు ప్రాజెక్టులను మన దేశంలో చేపడుతోంది. భారత్ లో ట్రంప్ సంస్థ వ్యాపార కార్యకలాపాలను పర్యవేక్షించే మేనేజింగ్ పార్టనర్ ఈ విషయాన్ని తెలిపారు. మన దేశంలో చేపడుతున్న ఐదు ప్రాజెక్టుల్లో రెండింటిలో ఇప్పటికే అమ్మకాలు ప్రారంభమైనట్లు చెప్పారు.. ఒక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాగా, మరో మూడు ప్రాజెక్టులకు సంబంధించి నిర్మాణాలు వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సంస్థ ఒకటి పూణేలోని పంచ్ శీల్ రియాల్టీ సంస్థతో కలిసి 48 అంతస్తుల జంట టవర్లను నిర్మిస్తోంది. నేషనల్ క్యాపిట్ ఏరియా (ఎన్ సీఆర్), బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, గోవా వంటి నగరాల్లో ట్రంప్ సంస్థ లగ్జరీ గృహాలను నిర్మించనుంది. ఈ విషయాన్ని ట్రంప్ తనయుడు జూనియర్ ట్రంప్ కూడా ఈ ఏడాది ప్రారంభంలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రంప్ టవర్ లు వెలిసే అవకాశాలున్నాయి.