: హైదరాబాద్ పాతబస్తీలో ఉప్పు ప్యాకెట్లు రూ.200 నుంచి రూ.300
రూ.500, రూ.1000 నోట్ల రద్దు కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగనున్నాయనే వదంతులు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ లో కిలో ఉప్పు ధర రూ.400 అవుతుందంటూ పుకార్లు జోరుగా కొనసాగిన విషయం తెలిసిందే. తాజాగా, ఆ వదంతులు హైదారాబాద్ కు కూడా పాకాయి. దీంతో, హైదరాబాద్ లోని పలుచోట్ల ఉప్పు ప్యాకెట్ల కోసం ప్రజలు ఎగబడ్డారు. ఇక్కడి పాతబస్తీలో అర్ధరాత్రి ఉప్పు ప్యాకెట్ల అమ్మకాలు జరిగాయి. ఈ ప్యాకెట్లను రూ.200 నుంచి రూ. 300కు వ్యాపారులు అమ్మినట్లు సమాచారం. బోరబండ, యూసుఫ్ గూడ, శ్రీరామ్ నగర్ లో భారీగా ఉప్పు కొనుగోళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఉప్పు కొరత లేదని, వదంతులు నమ్మవద్దని ఆ ప్రకటనలో కోరారు. వదంతులు సృష్టించి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.