: 'మంగళసూత్రం' కోసం గ్రూప్-2 పరీక్ష రాయకుండా వెనుదిరిగిన వివాహిత!
గ్రూప్-2 ఉద్యోగం కోసం మంగళసూత్రానికే పరీక్ష పెట్టారు అధికారులు. నిన్న తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే, పరీక్షకు హాజరైన అభ్యర్థులకు ఎన్నో కండిషన్లు పెట్టారు అధికారులు. ఒంటిపై ఉన్న చైన్లు, రింగులు, క్యాష్, గాజులు, మెట్టెలు, మంగళసూత్రాలు తీసేసి పరీక్ష హాలులోకి వెళ్లాలని అధికారులు చెప్పారు. దీంతో, పరీక్ష రాయడానికి వెళ్లిన అభ్యర్థులు తీవ్ర అసహనానికి గురయ్యారు. పలువులు మహిళా అభ్యర్థులతో పాటు, వారి భర్తలు కూడా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో, హైదరాబాదులోని భోలక్ పూర్ లోని అంజుమన్ సొసైటీ పరీక్ష కేంద్రం వద్ద ఓ మహిళా అభ్యర్థినిని మంగళసూత్రం తీసి పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలని అధికారులు చెప్పారు. అసలే శుక్రవారం... తాను ఎట్టి పరిస్థితుల్లోను మంగళసూత్రం తీయనని ఆమె వాదించింది. అయినప్పటికీ, రూల్స్ ఒప్పుకోవంటూ సిబ్బంది స్పష్టంగా చెప్పేశారు. దీంతో, ఆమె పరీక్ష రాయకుండానే వెనుదిరిగింది. ఇలాంటి నిబంధనలు విధించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.