: బ్యాంకు ముందు నోట్ల మార్పిడి కోసం క్యూలో నిలబడ్డ రాహుల్ గాంధీ.. సెల్ఫీలు తీసుకున్న ప్రజలు
పెద్దనోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ రోజు ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ లో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు శాఖకు వెళ్లి అక్కడ నోట్ల మార్పిడి కోసం క్యూ కట్టిన జనంలోకి వెళ్లి ఆయన కూడా క్యూలో నిలబడ్డారు. ప్రజల కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నానని తెలిపారు. ఈ సందర్భంగా క్యూలో నిలబడిన రాహుల్‌ను చుట్టుముట్టిన అక్కడి వినియోగదారులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడడం విశేషం. రాహుల్ స్మైల్ ఇస్తూ సెల్ఫీలకు పోజులిచ్చారు. చిల్లర కోసం తిప్పలు పడుతున్న బాధితులను రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. మోదీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకునే స్థితిలో ప్రభుత్వం లేదని ఆయన ఆరోపించారు.